పురాణాలలోని పుష్పకవిమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉండనే ఉంటుందట. అలాగే తెలుగుసినీరంగంలోనికి ఎందరు నూతన నాయికలు తామరతంపరగా ప్రవేశిస్తున్నప్పటికీ, ఎప్పుడూ ఒకరికి చోటు ఉండనే ఉంటుందని పరిశ్రమలో అంటుంటారు. ఏడాదికి సరాసరి తెలుగులో 120 నుంచి 150 చిత్రాలు నిర్మాణమైతే, వాటిద్వారా కనీసం 50 నుంచి 60 మందికి పైగా నూతన హీరోయిన్లు పరిచయమవుతున్నారు. అయితే వచ్చినవారిలో నిలబడే హీరోయిన్లు చాలా తక్కువమందే ఉంటున్నారు. అలా వచ్చినవారిలో అధికశాతం నూతన తారలకు రెండవ సినిమా లేదా మూడవ సినిమా ఉండటంలేదు. అయినా ఇవేమీ లెక్కచెయ్యక కొత్తనీరులా సినిమా రంగంలోనికి నూతన భామలు వస్తూనే ఉన్నారు. ఒక భాషకు చెందిన సినీరంగంలో అవకాశాలు కరవైతే వేరొక భాషలో అవకాశాలను వెదుక్కుంటున్నారు. అక్కడా దొరక్కపోతే ఎలాగూ మోడలింగ్, యాడ్స్ వంటివి చేసుకుంటూ కెరీర్‌ను ఎలాగోలాగ నెట్టుకొస్తున్నారు. ఒకప్పుడు నటనాపటుత్వం కలిగిన నాటకరంగ కళాకారులు సినిమారంగంలోనికి ఎక్కువగా వచ్చేవారు. ఆ తర్వాత మోడలింగ్ రంగం నుంచి నేరుగా సినిమా రంగంలోనికి రావడం అధికమైంది. ఈ ఏడాది ఇంతవరకు వచ్చిన వివిధ చిత్రాల ద్వారా ఎందరో నూతన నాయికలు తెలుగు సినీరంగానికి పరిచయం కాగా మరికొందరు రాబోయే చిత్రాల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగా, దేశీయ భామలతో పాటు కొందరు విదేశీ భామలు కూడా టాలీవుడ్లో రాణించాలని కోరుకుంటుండటం విశేషం. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే...!
రామ్‌చరణ్ కథానాయకుడిగా వచ్చిన 'ఎవడు' చిత్రం ద్వారా రెండవ కథానాయికగా పరిచయమైంది అమీజాక్సన్. లండన్‌కు చెందిన ఈ ఇంగ్లీషు తారకు మన టాలీవుడ్లో ఇదే తొలిచిత్రం. ఈ చిత్రం తర్వాత ఆమె తమిళ చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. వాస్తవానికి ఆమె హీరోయిన్గా అరంగేట్రం చేసింది కూడా తమిళ చిత్రం 'మదరాసిపట్నం' ద్వారానే. ఇప్పుడు ఎంచక్కా తమిళంలో విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'ఐ' చిత్రంలోనూ, సూర్య, నయనతార జంటగా తెరకెక్కుతున్న 'మాస్' చిత్రంలోనూ అమీజాక్సన్ నటిస్తోంది. ఇప్పటికే 'ఐ' చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, 'మాస్' చిత్రం కూడా తెలుగులో అనువాదమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ముందు ముందుకోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా తనకుఅవకాశాలు లభిస్తాయని ఆశావాదంతో ఉందట.
ఇక ఇదే ఏడాది వచ్చిన మహేష్‌బాబు '1' (నేనొక్కడినే) చిత్రం ద్వారా కృతిసనన్ కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం అనుకున్నంతగా బాక్సాఫీసు వద్ద ఆడకపోయినా ఆమెకు మరో అవకాశం లభించిందని వినికిడి. నాగచైతన్య కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కృతిని నాయికగా
ఎంపికచేశారని అంటున్నారు. మెడల్‌గా, కథక్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్గా ఇటు తెలుగు, అటు హిందీ చిత్రరంగాలలో బిజీ కావాలని కోరుకుంటోంది.
ఎన్.ఆర్.ఐ. భామలే కాదు కొందరు విదేశీ భామలు కూడా టాలీవుడ్లో నటించేందుకు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. లండన్‌కు చెందిన అమీజాక్సన్‌తో పాటు బ్యాంకాక్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న పింకీ సవికా కూడా 'ఎమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత తెలుగులో ఆమెకు ఇంతవరకు రెండవ అవకాశం లేకపోవడం గమనార్హం.
ఇక ఈ ఏడాదే బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'లెజెండ్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిద్వారా సోనాల్‌చౌహాన్ కథానాయికగా పరిచయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో ఆమెకు ఒకటికి రెండు అవకాశాలు లభించాయని అంటున్నారు. నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే నూతన చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కథానాయిక కాగా, మరో కథానాయికగా సోనాల్చౌహాన్ను ఎంపికచేశారని వినిపిస్తోంది. ఇక రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'పండగచేస్కో' చిత్రంలో కూడా ఓ కథానాయికగా సోనాల్ నటిస్తోంది.
ఈ కోవలోనే 'మనం' చిత్రంలో ప్రత్యేక పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశిఖన్నాకు ఆ చిత్రంతో పాటు కథానాయికగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రం కూడా మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఇప్పుడామెకు తెలుగులో బాగానే చిత్రాలొస్తున్నాయి. సందీప్‌కిషన్ సరసన ఆమె నటించిన 'జోరు' చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. మరోపక్క ఇంకొన్ని చిత్రాలలో కూడా ఆమెకు అవకాశాలొస్తున్నాయని, త్వరలో వాటి వివరాలు పూర్తిగా తెలుస్తాయని అంటున్నారు.
తొలి చిత్రంతోనే అభినయపరంగా, గ్లామర్‌పరంగా పేరు తెచ్చుకున్న కథానాయికగా ఇప్పుడు పూజాహెగ్డే పేరు కూడా టాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కన్నడ భామ ఇటీవల వచ్చిన 'ఒక లైలా కోసం' చిత్రం ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే. మరోపక్క ఆ సినిమా విడుదలకు మునుపే వరుణ్‌తేజ్ హీరోగా పరిచయం కానున్న 'ముకుంద' చిత్రంలో కూడా అవకాశం లభించడం విశేషం. మరోపక్క హిందీలో కూడా ఈ భామకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇక నితిన్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా మరో ఉత్తరాది భామ ఆదాశర్మ టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రం తర్వాత అవకాశాలు వెంటనే రాకపోవడంతో ఈ భామను కొంతమేరకు నిరాశ ఆవహించిందట. అయితే ఇటీవలనే ఈ భామకు అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో రెండవ కథానాయికగా అవకాశం లభించడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందట. దీంతో టాలీవుడ్లో మరింత బిజీ కావాలని ఈ భామ కోరుకుంటోంది.
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన 'రన్ రాజా రన్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. దీనిద్వారా కథానాయికగా పరిచయమైన సీరత్‌కపూర్‌కు కూడా వెంటనే బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇంతవరకు అనుకున్నంతగా ఆమె తెలుగులో బిజీ కాలేకపోయింది.
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్‌క్రీమ్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన తెలుగమ్మాయి తేజస్వి అంతకుమునుపు చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ, హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ఎంతో గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత వర్మ దర్శకత్వంలోనే వచ్చిన 'అనుక్షణం' చిత్రంలో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఇక 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం ద్వారా సనమఖ్భూల్, 'గాలిపటం' ద్వారా ఎరికాఫెర్నాండెజ్, 'నీజతగా నేనుండాలి' ద్వారా నజియా, 'గాయకుడు' చిత్రంతో శ్రియశర్మ, 'లవ్ యు బంగారం' ద్వారా శ్రావ్య, 'రోమియో' ద్వారా అడోనిక, 'ఐస్‌క్రీమ్-2'తో తెలుగమ్మాయి నవీన, 'నగ్నసత్యం' ద్వారా పాకిస్తానీ తార వీణామాలిక్, 'ఏప్రిల్‌ఫూల్'తో సృష్టి, ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఉలవచారు బిర్యాని' ద్వారా సంయుక్త, 'తొలిప్రేమకథ'తో కనికాతివారి, 'ఒక క్రిమినల్ ప్రేమకథ'తో ప్రియాంక పల్లవి, 'హ్యాంగ్అప్' ద్వారా నథాలియారౌత్, 'హృదయం ఎక్కడున్నది'తో సంస్కృతి, అనూష పరిచయమయ్యారు. ఇక నీలకంఠ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మాయ' చిత్రం ద్వారా సుష్మాస్వరాజ్, అవంతిక, నందినిరాయ్, 'హమ్‌తుమ్'తో సిమ్రాన్, 'ఆలీబాబా ఒక్కడేదొంగ' ద్వారా సుజవారుని పరిచయమయ్యారు. ఇక నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కథానాయకుడిగా నటించిన 'బాసంతి' చిత్రం ద్వారా హలీషాబేగ్, నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన 'ప్రతినిధి' చిత్రం ద్వారా శుభ్రఅయ్యప్ప, 'క్షత్రియ' ద్వారా కుంకుమ్, 'దిల్ దివానా' ద్వారా కృతిక సింఘాల్, శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన 'మల్లిగాడు మ్యారేజ్‌బ్యూరో' ద్వారా మనోచిత్ర, 'గాల్లో తేలినట్లుంది' ద్వారా ఖుషి పరిచయమయ్యారు. అయితే వీరిలో అధికశాతం మందికి ఇంతవరకు తెలుగులో రెండవ చిత్రం లేకపోవడం గమనార్హం. తెలుగు సినీరంగంపైన, అలాగే కెరీర్పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరు రెండవ అవకాశం దక్కకపోవడంతో నిరాశతో ఇతర భాషలలో అవకాశాలను వెదుక్కుంటున్నారు. ఇక విడుదలకు సిద్ధమైన 'భూ' ద్వారా సుప్రియఅసోలా, నిర్మాణంలో ఉన్న నితిన్ 'చిన్నదాన నీకోసం' ద్వారా మిస్తీ నాయికలుగా పరిచయం కానున్నారు. వీరే కాదు ఇంకా కొందరు నాయికలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, అలాగే నూతన చిత్రాల ద్వారా రాబోతున్నప్పటికీ ఎవరు బిజీ అవుతారో...ఎవరు రెండవ సినిమా లేక నిరాశతో వెనుదిరుగుతారో వేచిచూడాల్సిందే
Please Share this article
Related:
Tagged with: heroinessecondchances
శేఖర్ కమ్ముల రూట్ మార్చాడా?
అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు
కమిట్ అయ్యాను కాబట్టి వదిలిపెట్టను: రష్మిక
విజిల్ రిలీజ్ ఆపేసిన కోర్టు
సెక్సీయెస్ట్ ఏషియన్ మేల్ 2019 గా హ్రితిక్
అమితాబ్ ని వెంటాడుతున్న అలనాటి వ్యాఖ్యలు
రూట్ మార్చిన నాని
షకీలా సినిమాకు సెన్సార్ సమస్యలు
దూసుకెళ్తున్న సరిలేరు సాంగ్
హిందీ కోసం తెలుగును వాడుకొనని అంటుంది
నాగశౌర్య బాడీ చూశారా?
శింబు స్థానంలో రాఘవ లారెన్స్
ఆకట్టుకుంటున్న ప్రతిరోజూ పండుగే ట్రైలర్
రాంగోపాల్ వర్మ బ్యూటీఫుల్ సెన్సార్ పూర్తి
మరోసారి పాట పాడిన రాశిఖన్నా
సరిలేరు ట్రాప్ లో పడని దిల్ రాజు
Read More From This Category